తెలుగు NRI రేడియో లో RJ ప్రశాంతి ప్రయాణం…
ప్రపంచం లోని వివిధ దేశాలలో ఉన్న తెలుగువారందరి అభిరుచులను పంచుకోవడానికి, మానవ జీవన సరళిలో మంచి చెడులను, ప్రపంచం లోని రాజకీయ విశ్లేషణలను అందరితో పంచుకోవడానికి అంతర్జాల తెలుగు ఎన్ఆర్ఐ (NRI) రేడియో ఒక పెద్ద వేదికను అందరికి అందించింది. ఎందరో రేడియో జాకీలకు (RJ ) అవకాశాలు ఇస్తూ, వారిలోని సృజనాత్మకతను, అభిరుచులను ప్రోత్సహిస్తూ, అందరితో పంచుకోవడానికి అవకాశాన్ని కల్పిస్తుంది. ప్రపంచంలో వివిధ దేశాలలో ఉన్న తెలుగు వారందరికీ, ఇప్పుడు తెలుగు NRI రేడియో వారి గుండె చప్పుడయ్యింది.
ఖండ ఖండంతరాలలో ఉన్న తెలుగు వారందరి గుండె చప్పుడైన తెలుగు NRI రేడియో లో RJ ప్రశాంతి గారు వ్యాఖ్యాతగా ” కిట్టి పార్టీ ” కార్యక్రమాన్ని మొదలు పెట్టడం ఆమె జీవితంలో ఒక అనుకోని మలుపు అని తెలిపారు. ఒక గృహిణిగా నాలుగు గోడల మధ్యనే వినబడే తన గాత్రాన్ని RJ ప్రశాంతిగా ప్రపంచమంతా వినిపించేలా తెలుగు NRI రేడియో చేసిందన్నారు . సోమవారం నుంచి శుక్రవారం వరకు అమెరికా లోని నార్త్ కరోలినా నుంచి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు అని తెలిపారు. ప్రతి రోజు శ్రోతల అంశానికి స్పందిస్తూ, వారి అభిప్రాయాలను, అభిరుచులను తెలియజేస్తూ, పాటలు కవితలు వినిపిస్తూ, తను అడిగిన పొడుపు కథలకు, సామెతలకు సరదాగా సమాధానాలు చెబుతూ, ఎందరినో ఆత్మీయంగా పలకరిస్తూ ఇంట్లోని సభ్యులైపోయారు అని తెలిపారు.
ప్రశాంతి గారు ఉస్మానియా యూనివర్సిటీ లో మాస్టర్ ఇన్ సైన్స్ మరియు బి .ఎడ్ చేసారు. వారి కుటుంబంలో ఇద్దరు అక్కలు, ఒక అన్న తరువాత ప్రశాంతి చిన్నవారు. చదువు కంప్లీట్ అయ్యాక వేణు గారితో వివాహం జరిగింది. వేణు గారి ఉద్యోగ రీత్యా వారు అమెరికాలోని నార్త్ కరోలినా రాష్ట్రంలో ఉంటున్నారు. వారికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె. రేడియో జాకీగా విజయవంతంగా రాణించడంలో తన భర్త వేణు గారి ప్రోత్సాహం మరియు వారి పెద్ద అబ్బాయి జయంత్ ప్రొత్సాహం ఎంతో ఉందన్నారు. ఒక రేడియో జాకీ గా ఎన్నో విభిన్నమైన అంశాలను తీసుకుని వచ్చి, అందరితో చర్చించి ఒక మంచి పౌరులుగా మనల్ని మనం తీర్చుదిద్దుకోవడానికి ఎంతో దోహద పడుతుందని చెప్పారు. ఇది ఒక గొప్ప అవకాశంగా భావిస్తున్నాను అని తెలిపారు. దేశ విదేశాలలో వృత్తి రీత్యా వారి వారి కుటుంబాలకు దూరంగా ఉన్న వారికి, ఆరోగ్యం బాగోలేక ఇంట్లోనే ఉన్న వారికి, ఉద్యోగాలకు వెళుతూ వస్తూ దూర ప్రయాణాలు చేసే వారికి , గృహిణులకు, తెలుగు NRI రేడియో, వారి గుండె చప్పుడయ్యిందన్నారు. ఇంత మంది ఆత్మీయులకు RJ ప్రశాంతిగా పరిచయమయ్యి, వారందరికీ ఆనందాన్ని పంచి, వారందరి ప్రేమ, అభిమానాన్ని పొందగలిగినందుకు తనకి ఎంతో ఆనందంగా ఉందన్నారు.
రేడియో జాకీ ప్రశాంతి గా విభిన్న అంశాలను తీసుకురావడమే కాదు, సంఘంలో ఎన్నో సేవా కార్యక్రమాలను చేసిన వారిని, సాంస్కృతిక కార్యక్రమాలలో వారి ప్రతిభను కనబరిచిన వారిని, మానవతా దృక్పధంతో సేవలు అందించిన మానవతా మూర్తులను ఎందరినో ఇంటర్వ్యూ లు చేసి, వారి సేవలను ప్రపంచంలో ఉన్న తెలుగు వారందరికీ పరిచయం చేసే సదవకాశం కలిగిందన్నారు. దాదాపు యాబై (50) ఇంటర్వ్యూ లు నిర్వహించానని తెలియజేసారు. వారి గురువుగారైన ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫసర్ గోపాల్రావు గారిని ఇంటర్వ్యూ చెయ్యడం ఎంతో ఆనందాన్ని ఇచ్చిందన్నారు. ఆ అనుభూతి తన జీవితంలో ఒక మధుర జ్ఞాపకంగా మిగిలిపోతుంది అన్నారు. అలానే మాజీ మంత్రి, ప్రస్తుత బి.జే.పి లీడర్ డి.కె. అరుణ గారితో ఇంటర్వ్యూ, హై కోర్ట్ అడ్వకేట్ శ్రీ విజయ భాస్కర్ రెడ్డి గారితో ఇంటర్వ్యూ, ప్రముఖ ఫ్లూటిస్ట్ కళాకారుడు నాగరాజు తాళ్ళూరి గారితో ఇంటర్వ్యూ, న్యూ జెర్సీ బోర్డు అఫ్ పబ్లిక్ యుటిలిటీస్ శ్రీ ఉపేంద్ర చివుకుల గారితో ఇంటర్వ్యూ , ఓవర్సీస్ ఫ్రెండ్స్ అఫ్ బి.జే.పి ప్రెసిడెంట్ శ్రీ కృష్ణ రెడ్డి అనుగుల గారితో ఇంటర్వ్యూ , గత టి.డి.ఎఫ్ చైర్మన్ మరియు గత ఆట ప్రెసిడెంట్ గా చేసిన డాక్టర్. గోపాల్ రెడ్డి గాదె గారితో ఇంటర్వ్యూ , జానపద గాయకుడు కళాశ్రీ భిక్షు నాయక్ గారితో ఇంటర్వ్యూ , సాయి దత్త పీఠం (న్యూ జెర్సీ) చైర్మన్ రఘు శర్మ గారితో ఇంటర్వ్యూ, ప్రవాస బాలలకు తెలుగు నేర్పుతున్న సిలికానాంధ్ర మన బడి కి ఉపాధ్యక్షులుగా ఉన్న డాంజి తోటపల్లి గారు, శ్రీకాంత్ కొల్లూరి గారులతో ఇంటర్వ్యూ మరియు అమెరికా లోని అన్ని తెలుగు అసోసియేషన్స్ (TANA , NATA, ATA మొదలగు) వారితో ఇంటర్వ్యూలు నిర్విహించానని, ఇలా ఎందరో ప్రముఖులను ఇంటర్వ్యూ చేసే మహద్భాగ్యం తనకి కలిగింది అని తెలిపారు.
రేడియో జాకీ ప్రశాంతిగా ప్రపంచానికి పరిచయం చేసి, ఆత్మీయులతో పరిచయం కలిగించి, ఎందరో ప్రముఖులను ఇంటర్వ్యూ చేసి, అందరికి వారి గురించి తెలియజేసే అవకాశం కల్పించిన తెలుగు ఎన్ఆర్ఐ రేడియో మేనేజ్ మెంట్ విలాస్ జంబుల, మామ మహేష్ మరియు వెంకట్ గార్లకి హృదయ పూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ, కాల్ చేసిన ప్రతి ఒక్కరి కాల్ ని తీసుకుని సహకరించిన సాంకేతిక నిపుణులకు, ముఖ్యంగా మా కార్యక్రమాలను ప్రోత్సహిస్తున్న ఆత్మీయులకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని తెలియచేసారు.
Leave Your Comment Here