బహుదూరపు బాటసారి అమెరికాయానం…

ఒక్క మాట. ఆ ఒక్క మాట. తండ్రి మరణం తో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాల కోసం చేయాలనుకొన్న ఆ ఒక్క ‘ఓదార్పు’ మాట. ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం కోసం, కోరి కష్టాలను కౌగిలించుకుని, సమస్యల వలయంలో, కుట్ర కుతంత్రాల్లో నలిగి పోరాడిన ఒక వీరుడి పోరాట పటిమకు ప్రతిరూపమే ఇటీవల జరిగిన ఎన్నికల్లో విజయం. జగన్‌ రాజకీయ రంగంలోకి ప్రవేశించి పదేళ్లు అయింది. ఈ పదేళ్ల ఆయన ప్రస్థానం, మరో వందేళ్ల వరకు పాఠాలు చెబుతుంది. ఈ పదేళ్లలో ఆయన తనను తాను మలుచుకున్న తీరు, ఒక సమర్థమైన నాయకుడిగా ఎదిగిన విధానం యువతకు ఎంతో మార్గదర్శకం.

చేయని తప్పులకు నిందలు మోయాల్సి వచ్చినా, జైల్లో మగ్గాల్సి వచ్చినా, చివరకు ప్రాణం మీదకు వచ్చినా, మాట తప్పని తీరునూ, మడమతిప్పని తత్వాన్ని జనం క్రమంగా అర్థం చేసుకున్నారు. రాజకుమారుడిలాగా జీవించే అవకాశాలున్నా తృణప్రాయంగా కాలదన్ని కష్టాల కొలిమిలో తనను తాను కాల్చుకున్నాడు. అగ్ని సరస్సున వికసించిన వజ్రంలా రాటుదేలాడు. రోజులు, నెలలు, సంవత్సరాల తరబడి ప్రజల్లో తిరుగుతూ, వాళ్ల బాధలు, గాథలు వింటూ ధైర్యం చెబుతూ తన చెమట చుక్కలు ధారబోసి ఒక రాజకీయ పార్టీని ప్రజల హృదయాల్లో ఆయన నిర్మించుకున్నాడు. ఆయన పదేళ్ల కఠోర శ్రమకు, ప్రజా సంక్షేమం కోసం తాను చేసిన ఒక గొప్ప తపస్సుకు ప్రజలు ప్రసాదించిన వరమే ఈ విజయం. అందుకే ఈ విజయం అత్యంత విలువైనది. ఈ విజయం ఎన్నో పాఠాలు నేర్పుతుంది. ఈ విజయం ఉన్నత భవిష్యత్తుకు బాటలు వేస్తుంది.

ఆయన చిత్తశుద్ధి ప్రజల మనసులని సూటిగా హత్తుకుంది.ప్రతి దీవెనా స్వాతి చినుకులా కురిసి, ఓటుగా ప్రతిఫలించింది. జగన్‌మోహన్‌రెడ్డి సుదీర్ఘ పాదయాత్రలో అడుగడుగునా రాష్ట్ర ప్రజల సమస్యలు చూశాడు. వారి దుఃఖం చూశాడు. విలయ తాండవం చేస్తున్న అవినీతిని, ఆశ్రిత పక్షపాతాన్ని కళ్లారా చూశాడు. పాలకుల ఎద్దేవాలు, ఎగతాళి కూతలు, నిందలు, నిరాధార ఆరోపణలు, హత్యా ప్రయత్నాలు, కుటిల యత్నాలు ….ఎన్నో మరెన్నో మదిలో దిగమింగుకొని, రాష్ట్రం సరిహద్దుల్లో ఒక కొసనించి అటు కొసదాకా నడిచి నడిచి నడిచి ప్రజానీకానికి చిరునవ్వుతో అభయం ఇస్తూ ముందుకు సాగాడు. మట్టిని, మట్టి మనుషుల్ని తట్టి పలకరించారు. తథాస్తు! కులం బలం లేదు. మీడియా తాలూకు బలం అసలే లేవు. 23 మంది పార్టీ ని వీడితే మే 23న తిరిగి ఆ 23మందిని మిగిల్చి మిగిలిన అన్ని సీట్లు గెలిచి , తెలుగు రాష్ట్రాల్లో కనీ వినీ ఎరగని రీతిలో విజయం సాధించి ముఖ్యమంత్రి గా ప్రమాణం చేసి, మొదటి రోజు నుంచే ఆ ప్రమాణ స్వీకారానికి ఉన్న ప్రమాణాలు పెంచి, తన బహుదూరపు పాదయాత్ర లో చూసిన, విన్న సాధక సమస్యల పరిష్కారానికై ఆవిష్కరించిన నవరత్నాల అమలులో నిరంతరం పాటుపడుతూ ఉన్నాడు. అలాంటి ఘనవిజయం వెనుక ప్రవాసాంధ్రుల కృషి ఎంతో ఉంది. పగలంతా ఆఫీస్ లో పని , రాత్రివేళ ( అనగా ఇండియా లో పగలు) తన బందుమిత్రులతో మాట్లాడి, పార్టీ విజయానికి తోడ్పడాలని కోరి, తమ వంతు సహాయం చేశారు. ఎంతో మంది ఎన్నికల సమయంలో పని మానుకొని ఆంధ్ర వెళ్లి NRI బస్ యాత్ర, NRI ఎన్నికల ప్రచారం వంటి వినూత్న మైన పద్ధతులలో ప్రచారం చేసి విజయం లో భాగస్వామిలైనారు.

అభివృద్ధి లో గానీ, మనలాంటి రాష్ట్రాలను ఆదుకోవడం లో గానీ మనకు ఆసరాగా ఉంటున్న అమెరికా దేశానికి ముఖ్యమంత్రి హోదాలో మొదటి సారిగా విచ్చేయనున్నారు. మతం, కులం, పార్టీ బేధాలు లేకుండా అమెరికాలోని 50 రాష్ట్రాలలో ఉన్న వేలకు వేల తెలుగు వారు, తెలుగు సంఘాలు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గారికి ఘన స్వాగతం పలకడానికి ఆసక్తిగా ఎదరుచూస్తున్నారు. ఇది తన వ్యక్తిగత ప్రయాణమైనా, ప్రభుత్వ కార్యక్రమం కాకున్ననూ ప్రవాసాంధ్రుల కోరిక మేరకు జగన్ డల్లాస్ లో అందరినీ కలిసి ప్రసంగించనున్నారు. ఎంతో ప్రత్యేకత సంతరించుకున్న ఈ సభ విజయవంతం గా జరగాలని మనస్పూర్తిగా కోరుకుంటూ … గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారి కి సాదర స్వాగతం 🙏🙏🙏